సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద నేడు, ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర విషాదం ఏమిటంటే మృతుల్లో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో ఎస్సై సమందర్ భార్య, కుమార్తె, మరదలు తోపాటు మరో మహిళ, ప్రైవేటు డ్రైవర్ ఉన్నారు. చిన్నగంజాం తిరుణాళ్ళకి వెళ్లి అద్దంకి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
