సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో చేనేత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నేడు, సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారతదేశం హస్త కళలకు పుట్టినిల్లని.. అటువంటి కళల్లో ముఖ్యమైనది చేనేత కళ అని చెప్పారు. అగ్గి పెట్టెలో పట్టే చీరను నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పతనం చూసి ప్రపంచం అబ్బురపడిందన్నారు. నేడు ‘చేనేత దినోత్సవం’ జరుపుకొంటున్న శుభ తరుణంలో తన తరఫున, జనసేన తరపున ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక కాలంలో కాస్తంత మసకబారిన ఈ చేనేత కళకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం తమ వంతు కృషి చేయాలని చెప్పారు. ప్రజలంతా విధిగా వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ఘన చారిత్రక నేపథ్యం కలిగిన చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా తనను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు..
