సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్లో ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ రేపటి నుండి అంటే ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఏపీఈఏపీ సెట్-2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే రెండు దశల్లో స్పాట్ అడ్మిషన్లు ముగిశాయని, అయితే మరోసారి..ఇప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకుని, తొలి, తుది దశ స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందలేని విద్యార్థులు మాత్రమే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్కు అర్హులని ఆమె తెలిపారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోని బీఈ/బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఈనెల 8న ఆప్షన్ల మార్పుకు అవకాశం, 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈనెల 11 నుంచి 13 లోపు అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. వీరు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీయింబర్స్మెంట్ సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకూ అర్హులే..
