సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సీటు వదులుకొన్న తరహాలోనే పవన్ ఏరికోరి తీసుకొన్న కాకినాడ సీటు నుండి కూడా పోటీ తప్పుకొన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాకినాడ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, అక్కడ గెలిస్తే, కేంద్ర మంత్రి పదవి ని ఎన్డీయే పెద్దలు ఆఫర్ చేస్తారని వచ్చిన వార్తలు నిజమేనని అంగీకరించిన పవన్ నేడు, మంగళవారం ఫుల్ స్టాప్ పెట్టారు. పిఠాపురం లో తన కోసం సిటు త్యాగం చేసిన ఉదయ్‌ను కాకినాడ ఎంపీ స్థానంలో పోటీకి పంపిస్తున్నానని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. పిఠాపురానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు భారీగా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘కాకినాడ ఎంపీ కూడా మనదే.. అందరూ కలిసి పని చేయాలి. కాకినాడ పార్లమెంట్ జనసేన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలి. వైసీపీ అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, వంగా గీత గారు మన ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ గారు ఇటీవల ఎక్కడో పెళ్లిలో కూడా నాకు కనిపించారు. సునీల్ మంచివారే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నారు. కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్ అని అందరూ అంటారు. నేడు కాకినాడ గంజాయికి కేంద్రంగా, క్రైం పట్టణంగా మారింది. వీటిని ఆపాలంటే బలమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటేనే ఇవి సాధ్యం’’ అని అన్నారు.
