సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వినాయక చవితి సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అందరి ద్రుష్టి ఖైరతాబాద్ మహా గణపతి మీదనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. వినాయక చవితి వేడుకలలో తెలుగు రాష్ట్రాల భక్తులతో 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. చివరిరోజు నిమజ్జనం నాడూ భక్తజనం శోభాయాత్రలో భారీగా పాల్గొనడం తో పాటు దేశం యావత్తు టీవీలలో వీక్షిస్తూనే ఉంటారు. మరి ఈసారి 70 సంవత్సరాల ఖైరతాబాద్ (Khairatabad) గణపతి ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో తొలిసారి 70 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టి, సహజ రంగులతో పర్యావరణహితంగా గణపయ్యను సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఈసారి ఉత్సవ కమిటీలో విభేదాలు కారణంగా ఏర్పాట్లు ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ గత నెల రోజులుగా శరవేగంగా పనులు చేస్తుండటంతో ఇప్పటికే మట్టి పనులు పూర్తికాగా..ఇక ముచ్చటైన రంగులద్దే పనులు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా నామకరణం చేసి అదే రూపంలో తయారు చేస్తున్నారు. ఏడు ముఖాల్లో ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు…మరోవైపు అమ్మవార్లు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్యన గణపతి ఉన్నారు. 14 చేతుల్లో గణపతి కుడివైపు చక్రం, అంకుశం, గ్రంధం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలు ఉండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో చూడముచ్చటగా తయారు చేశారు.
