సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: తిరుమల లడ్డూప్రసాదాన్ని వైసీపీ హయాంలో అపవిత్రం చేశారంటూ, లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారని సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేడు, శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి ప్రసాదాలపై దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు నీచాతి నీచంగా టీటీడీ లడ్డుపై మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనో భావాలు దెబ్బతిన్నాయన్నారు. జంతువుల కొవ్వు వాడుతున్నమని చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందన్నారు. స్వామి వారి పాదాల చెంత నా కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా శ్రీవారి పాదాల వద్ద ఈ ఆరోపణలు నిజమేనని ప్రమాణం చెయ్యాలి దీనికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్ట్ వరకు వెళ్తామని స్పష్టం చేశారు. స్వామి నైవేద్యానికి ప్రతిరోజూ 60 కిలోల ఆవు నెయ్యికావలసి ఉంటుందన్నారు. స్వామి వారి నైవేద్యం పవిత్రత కోసం వాడే పదార్ధాలు అన్నీ మార్కెట్‌లో కొంటే రసాయనాలు కలుస్తాయని తాము సేంద్రియ పద్దతులలో ప్రత్యేకంగా పండించామని , ఆర్గానిక్ నెయ్యి ద్వారా తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసామని తెలిపారు. దానికోసం రాజస్థాన్‌లో ఉన్న గోశాల నుంచి తెచ్చి నెయ్యి వాడామన్నారు. కేంద్రం రాష్ట్రాలలో వారే అధికారంలో ఉన్నారు. ఎవరి ద్వారా అయినా దర్యాప్తు చేసుకొన్నా నేను సిద్ధంగా ఉన్నాను అని సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *