సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి సోమవారం నుంచి పోలీస్ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలను ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని సివిల్ (పురుష, మహిళలు), ఏపీఎస్‌పీ (పురుషులు) ప్రిలి మనరీ పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను నేడు అంటే ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే జనవరి 9వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీతో పాటు ఎఆర్ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్ శేఖర్, ఎఆర్ డీఎస్పీ బి చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4976 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు మంజూరు చేశామన్నారు. వీరిలో 3997 మంది పురుషులు, 979 మహిళలు పాల్గొంటున్నారని తెలిపారు. మహిళా అభ్యర్థినులకు ప్రత్యేకంగా జనవరి 3,4 తేదీలలో మహిళా సిబ్బందితో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 204 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని దీనికోసం పారదర్శకంగా ఏర్పాట్లు చేశామని ముందస్తుగా రెండు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశామన్నారు.
