సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : రానున్న గోదావరి పుష్కరాలకు ఉమ్మడి పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాల లో లక్షలాది ప్రజల పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా 238 స్నానాల రేవుల అభివృద్ధి, నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లకు నిధుల ఖర్చుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం, కోనసీమ, రాజమండ్రి, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రేవులు, అదనంగా నిర్మించే కొత్త ఘాట్లు ఉన్నాయి. కొన్ని ఘాట్లను విస్తరించే పనులు కూడా ప్రతిపాదించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నరసాపురం ప్రాంతాల్లో 12, పాలకొల్లు 13, ఆచంటలో 9 పుష్కర స్నానాల ఘాట్లు ఉన్నాయి. వీటికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. వీటిలో నరసాపుంలోని వలంధర్, యలమంచిలి మండలంలో లక్ష్మీపాలెం, పెనుగొండ మండలంలోని సిద్ధాంతం రేవుల్ని విస్తరించనున్నారు. సిద్ధాంతంలో మూడు రేవులు ఉన్నాయి. మూడింటిని కలిపి 80 మీటర్ల రేవుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక లక్ష్మిపాలెం రేవును కూడా ఇదే తరహాలో విస్తరించేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
