సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఎట్టకేలకు రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ను నేడు శనివారం సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయ పాలెం గ్రామం నుంచి ప్రారంభించారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పధకంలో రైతులు, అటవీ భూమి సాగు హక్కుదారులు, భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున లబ్ధి చేకూరనున్నది. ఇందులో రూ.6వేలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. మిగతా రూ.14వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ పథకం అర్హతలో భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలను ఒక రైతు కుటుంబంగా, పిల్లలకు పెళ్లిళ్లు అయితే ప్రత్యేక కుటుంబంగా పరిగణించనున్నారు. సాగుభూమిపై చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తి భూయజమానిగా గుర్తిసారు. ప్రస్తుత, మాజీ.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, రిటైరైన, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, అనుబంధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, స్థానిక సంస్థల్లోని రెగ్యులర్ ఉద్యోగులు అనర్హులు. నెలకు రూ.10వేలు పైన ప్రభుత్వ పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్, అండర్ టేకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నవారు, గృహాలుగా మార్చిన వ్యవసాయ భూములు కలిగిన వ్యక్తులు, ఆక్వా సాగు, వ్యవసాయేతర వినియోగం భూములున్న వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. అయితే నెలకు రూ.20వేల లోపు జీతం తీసుకునే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
