సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పరిష్కరించుకొని నేడు, శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి ప్రకాశం చౌక మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే వ్యాధి నుండి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ వ్యాధి పట్ల స్త్రీ, పురుషులు తేడాలేకుండా ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు ముందస్తుగా నిర్వహించుకోవాలన్నారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదని, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాది ఇది అన్నారు. మహిళలు మొహమాటం, బిడియంతో వెనుకంజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలన్నారు. సమాజంలో బిపి, షుగర్ లతోపాటు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదు అవుతున్నా యన్నారు. వీటిలో చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడటంతో రేడియో, కీమో చికిత్సలు తీసుకోవలసిన అవసరం రావడం, తిరిగి నయం చేయలేని స్థితిలో వుండటంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నయీం అస్మీ, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ బి. గీతా బాయి, మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, డీఈవో ఇ నారాయణ, కూటమి నేతలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *