సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు, వ్యక్తిగత జీవితంలో అత్యున్నత నైతిక విలువలను ప్రదర్శించి, పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన ఇద్దరు హోం గార్డులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్. నేడు, శనివారం భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్. నాగేశ్వరరావు మరియు నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో హోం గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కె. సూర్య సాగర్ లు ఇద్దరూ శుక్రవారం పాలకొల్లు పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో, వారి ముందు వెళ్తున్న ఒక మహిళ మెడ నుండి సుమారు రూ. 5 లక్షల విలువైన (నాలుగున్నర కాసుల) బంగారు గొలుసు ప్రమాదవశాత్తు జారిపడటాన్ని వీరిద్దరూ గమనించారు.క్షణమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ మహిళను వెంబడించి, వాహనాన్ని ఆపి, ఆభరణం జారిపోయిన విషయాన్ని తెలియజేశారు. ఆభరణం తిరిగి దక్కడంతో సదరు మహిళ ఆనందబాష్పాలతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఈరోజు ఆ హోమ్ గార్డ్ లను స్వయంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. వీరి నిస్వార్థ సేవలను గుర్తించి, రాబోయే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా స్థాయి “ఉత్తమ సేవా ప్రశంసా పత్రాల” కొరకు వీరి పేర్లను నామినేట్ చేస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి సత్యనారాయణ గారు, నరసాపురం సబ్ డివిజన్ డిఎస్పీ జి.శ్రీ వేద , హోం గార్డ్ ఇన్చార్జ్ ఆర్ఎస్సై కె.గోపి కృష్ణ గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *