సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, శనివారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో సి.ఐ.ఎస్.ఎఫ్ (CISF) ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ విభాగాలకు ఎంపికైన 392 అభ్యర్థులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ రోజ్ గార్ మేళాలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో 61,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ 2022 అక్టోబర్ 22న ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ‘మిషన్-మోడ్’లో అత్యంత వేగంగా, పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని, గత రెండేళ్లలో 11 లక్షలకు పైగా యువతకు ఉపాధి కల్పించడం జరిగిందని శ్రీనివాస వర్మ అన్నారు. విశాఖపట్నంలో నియామక పత్రాలు అందుకున్న వారిలో అత్యధికంగా రక్షణ, సాయుధ దళాలకు ఎంపికైన వారు ఉండటం గర్వకారణమని ఆయన కొనియాడారు.
