సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, శుక్రవారం ఉదయం మడుగు పోలవరం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో మహిళలతో వచ్చి ఎమ్మెల్యే కార్యాలయంలో వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అంజిబాబు ను కోరి వినతిపత్రాన్ని అందించారు. మంచినీటి, రోడ్లు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అంజిబాబు అధికారులతో మాట్లాడారు. వచ్చే సోమవారం నాటికీ మడుగు పోలవరం గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని, 4 నెలల్లో పూర్తిస్థాయిలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం బోరును మరమత్తులు చేసి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామన్నారు. గ్రామంలో డబుల్ రోడ్డు వేయడానికి కృషి చేస్తానని, ఈ విషయంపై ఆగస్ట్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు.
