సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కొన్ని గ్రామాలను ఇటీవల ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మున్సిపాలిటీలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఏపీలోని మున్సిపాలిటీలలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు, బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారించింది.ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు. దీనిపై స్టే ఇవ్వనప్పటికీ మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం ప్రక్రియ.. తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే సమయంలో స్థానిక గ్రామ పంచాయతీల తీర్మానాలు, గ్రామస్థుల ఆమోదం తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు.మున్సిపాలిటీల్లో గ్రామాలు విలీనం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి గ్రామీణ సంక్షేమ పథకాలు కోల్పోవాల్సి వస్తుందని, స్థానిక స్వపరిపాలన హక్కులు దెబ్బతింటాయని పిటిషనర్లు వాదించారు. ఇప్పటికే దీనిపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
