సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు అపారమైన భక్తిని చాటుకుంటూ ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేయించిన ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించనున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.160 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. మొత్తం 9 సెట్లుగా రూపొందించిన 45 రకాల బంగారు ఆభరణాలను స్వామివారి సేవలో సమర్పించేందుకు భక్తుడు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ భారీ కానుక సమర్పణకు సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో సదరు భక్తుడు సంప్రదింపులు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులకు ఈ బంగారు ఆభరణాలను అధికారికంగా అందజేయనున్నారు.
