సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం సాయంత్రం వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల మేళతాళాలు, గణేష్ మహారాజ్ కి జై అంటూ యువత చిందులు తో పంచామరాత్రులు నిర్వహించిన శ్రీ గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో పలు చెరువులు, కాలువల వద్ద సందడి నెలకొంది. అయితే ఒక విషాద కర ఘటన జరిగింది. గణపవరం కు సమీపంలోని కొయ్యల గూడెం మండలం వెలగలదిబ్బకు చెందిన ఉక్కుర్తి దొరబాబు (45), ఎస్కే రియాజ్ (25) చెరువులో మృతి చెందారు. వెలగలదిబ్బలో ఊరేగింపుగా దగ్గర్లో ఉన్న పోతన చెరువులో గణపతి విగ్రహం నిమజ్జనం చేయడానికి వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వీరిద్దరు చెరువులో మునిగిపోయారు. స్థానికులు ఇద్దరినీ బయటకు తీసి జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లేసరికి ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు అవివాహితుడు అయిన ముస్లిం యువకుడు ఎస్కే రియాజ్ ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ముస్లిం యువకుడే స్వయంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్నాడు. మరో మృతుడు దొరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం అలముకొంది.
