సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్షాలు తక్కువ పడటంతో ఈ ఏడాది తక్కువ పంట దిగుబడి వస్తుందని ప్రచారంలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. ఏపీలో నిత్యావసర వస్తువుల అమ్మకాలలో మిగతా రాష్ట్రాలలో మించిన ‘దోపిడీ ‘మొదలయింది. రిటైల్ మార్కెట్ లో 26 కేజీల సన్నల బియ్యం రేట్లు 1200 రూపాయలు నుండి ఒక్కసారిగా సుమారు 2000 కు అటుఇటు గా భారీగా ధరలు గత 6 నెలలుగా పెంచుకొంటూ పోతున్నారు. ధరలు అదుపులో లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు గొగ్గోలు పెడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేడు, సోమవారం విజయవాడ భవానీపురం రైతు బజార్లో బియ్యం పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లలో బీపీటీ సన్న రకం బియ్యం కేజీ రూ.49 చొప్పున 26 కేజీల బ్యాగ్‌లో ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఎక్కువగా కోరుకునే నెల్లూరు కేఎన్ఎం వెరైటీ బియ్యం మార్కెట్లో రూ.85 ఉండగా, కేవలం రూ. 50 కే పౌరసరఫరాల శాఖ ద్వారా ఇస్తున్నామని చెప్పారు.దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచామన్నారు. మార్కెట్లో రూ.50 వరకు ఉన్న గోధుమ పిండిని కేవలం రూ.25 కే వినియోగదారులకు అందిస్తామని చెప్పారు.రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తామని నాదెండ్ల తెలిపారు. నాగ్‌పూర్ నుంచి నాణ్యమైన ఉల్లిపాయలను తెప్పించి రూ.35 కేజీ చొప్పున ఈరోజు నుంచి అన్ని రైతుబజార్లలో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఈ పండుగ సీజన్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధరలను నియంత్రిస్తామన్నారు.
