సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అత్తిలిలో రూ.1.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ కేంద్రాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, అత్తిలిలో నూతన డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ఏడు డయాలసిస్ యంత్రాలతో పాటు ఇతర వైద్య సదుపాయాల కల్పన కోసం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ పరిధిలోని ఎన్‌ఎండీసీ (NMDC) సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.కోటి సమకూరినట్లు మంత్రి వివరించారు. మిగిలిన రూ.80 లక్షలను లయన్స్ క్లబ్, ప్రజా విరాళాలు, దాసం ప్రసాద్ కుటుంబం అందించాయని తెలిపారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, తాను గతంలో లయన్స్ క్లబ్ సహకారంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం అత్తిలిలో మరో నూతన కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు.
