సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 7, ఆంధ్రప్రదేశ్లో 9 పోస్టుల వరకు ఉన్నాయి. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 28, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతి (మెట్రిక్యూలేషన్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వారి వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. మోటార్ మెకానిజం పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. .దరఖాస్తుదారుల వయోపరిమితి సెప్టెంబర్ 28, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసులో నోటిఫికేషన్లో సూచించిన విధంగా సడలింపు వర్తిస్తుంది. టైర్-1, టైర్-2 రాత పరీక్షలతోపాటు డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
