సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మెరసా తుఫాను ప్రభావంతో భీమవరం లో గత సాయంత్రం ప్రారంభమైన వర్షం నేటి మంగళవారం సాయంత్రం వరకు, కొద్దీ విరామాలు మినహా కుండపోతగా కొనసాగుతూనే ఉంది. దీనితో భీమవరం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాలను భీమవరం పురపాలక సంఘం కమిషనర్ కె. రామచంద్రారెడ్డి నేటి ఉదయం నుండి మునిసిపల్ కార్మికులు అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతం మరియు చినరంగానిపాలెం సైఫాన్ ప్రాంతాలను సందర్శించి వర్షపు నీరు నిలిచిన పరిస్థితులను, ముంపు తీవ్రతను, డ్రైనేజీ వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించారు. భారీగా నీరు నిలిచిపోవడానికి కారణం అయిన స్థానిక బియంకే రైస్ మిల్ వద్ద ఉన్న డ్రైనేజీ ని పరిశీలించి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించి, వర్షపు నీరు డ్రైనేజీ ద్వారా యనమదురు కాలువలోకి సజావుగా ప్రవహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని త్వరితగతిన తొలగించేందుకు అవసరమైన మోటార్లు, పంపుల ద్వారా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ ల్లో చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, డీఈ రహీమ్, ఏఈ రవితేజ మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *