సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామా పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్స్ పర్వము ఒక ప్రక్క జోరుగా కొనసాగుతుండగా.. భీమవరం మండలంలో సుమారు ఐదు వేల ఓట్లు ఉన్న గొల్లవానితిప్పగ్రామంలో సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో.. జనసేన పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. నేను రెండు ఎకరాలు ఇస్తా.. కాదు మూడు ఎకరాలైనా ఇస్తా! అంటూ ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. .జనసేన పార్టీలోని ఇద్దరు నాయకులు తమ భార్యలను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తుల ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఒకవైపు కొప్పర్తి శ్రీరామచంద్ర మూర్తి తన భార్య రామలక్ష్మిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇస్తానని ప్రకటించారు.మరోవైపు జనసేన నాయకుడు జంగాల తాతాజీ కూడా వెనక్కి తగ్గలేదు. తన భార్య ధనలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మూడు ఎకరాల భూమిని గ్రామాభివృద్ధికి అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో రెండు ఎకరాలా..? మూడు ఎకరాలా..? అనే చర్చ మొదలైంది. మరోవైపు గ్రామంలో గతంలో గెలిచిన వైసీపీ పార్టీకి కూడా బలమైన పట్టుండటంతో వారు ఏకగ్రీవానికి ప్రస్తుతం ససేమిరా? అంటున్నారు. అయితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా? లేక ఎన్నికల పోరు తప్పదా? అన్నది, హాట్ టాపిక్ గా మారింది.
