సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సిపార్సు మేరకు నర్సాపురం – ఎస్ఎంవీబీ (బెంగళూరు) – నర్సాపురం మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తున్న రైలు (నం. 17293/17294)ను రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా రైల్వే బోర్డు అధికారికంగా ఆమోదించింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు భీమవరం మీదుగా రెగ్యులర్ శేషాద్రి ఎక్స్ ప్రెస్ తో పాటు బెంగళూరుకు మరో శాశ్వత రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.ఈ నూతన రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సేవలను జూలై 10 (శుక్రవారం) సాయంత్రం 4:00 గంటలకు పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైలు నెం. 17293 నర్సాపురం – ఎస్ఎంవీబీ బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నర్సాపురం నుంచి బయలుదేరి పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు ఎస్ఎంవీబీ (బెంగళూరు) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 17294 ఎస్ఎంవీబీ బెంగళూరు – నర్సాపురం వీక్లీ ఎక్స్‌ప్రెస్ జూలై 11 నుంచి ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి కాట్పాడి, రేణిగుంట, నెల్లూరు, తెనాలి, ఒంగోలు, కావలి, విజయవాడ, తదితర స్టేషన్ల మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5:50 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది. ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో పాటు జనరల్ సిట్టింగ్ కోచ్‌లు కూడా ఏర్పాటు చేశారు.
