సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ సీజన్ లో మన తెలుగు వారు లక్షలాదిగా తరలివెళ్లే శబరిమల లో అయ్యప్ప స్వామి దివ్య పుణ్య క్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. నేడు, సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి 1,07,260 మంది భక్తులు ఆన్ లైన్లో నే బుకింగ్ చేసుకున్నారంటే, ఇక మాములుగా వచ్చే భక్తుల రద్దీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఇదే అల్ టైం రికార్డు అని తెలిసింది. దీంతో.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం, ఆలయ బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.గత శనివారం కూడా లక్షమంది దాకా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. రద్దీకి తోడు వర్షం కురవడంతో..రద్దీ నియంత్రణలో పోలీసులకు గాయాలయ్యాయి. గత ఆది, సోమవారాల్లో కూడా ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌లో 1.10 లక్షల మంది దాకా బుక్ చేసుకున్నారు.దీనిపై కేరళ హైకోర్టు ‘‘ఇంతలా రద్దీ పెరిగితే నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరో గంట పాటు దర్శన వేళలను పొడిగించలేరా?’’ అంటూ పోలీసులను ప్రశ్నించింది.ఈ అంశంపై నేడు, సోమవారం సాయంత్రం అసెంబ్లీ హాలులో సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. మరోవైపు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్శన వేళలను రాత్రివేళలో మరో గంట పాటు పెంచాలని దేవస్థానం బోర్డు , ప్రధాన తంత్రి నిర్ణయించినట్లు తాజా సమాచారం.
