సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద ఇటీవల చైనా మన బోర్డర్ లోకి వచ్చి భారత సైనికులుతో ఘర్షణకు దిగిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు, మంగళవారం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, అడ్మిరల్ ఆర్ హరి కుమార్, జనరల్ మనోజ్ పాండే, ఫారిన్ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాట్రా, డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అరమనే ఈ సమావేశంలో పాల్గొంటారు. వివరాలలోకి వెళితే గత డిసెంబర్ 9వ తేదీన వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారని, వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు, చైనా సైనికులను ఎదురుదాడి చేసి సమర్ధవంతంగా తరిమివేశామని తెలిపింది.
