సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆధార్ కార్డు తనిఖీకి సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీచేస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తాజగా ఒక ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసే సంస్థలు(ఓవీఎస్ఈ) గతంకన్నా మెరుగైన భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించిం ది. దీనివల్ల ఆధార్ భద్రతపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పించేందుకు ముందుకువస్తారని అభిప్రాయపడింది. వారు చేసిన సూచనలలో కీలకమైనవి: ఓవీఎస్ఈలు ఆఫ్‌లైన్ ధ్రువీకరణ చేసే ముందు ఆధార్ పొందిన వ్యక్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.ఆధార్ భద్రత, గోప్యత గురించి వారికి భరోసా ఇవ్వాలి. భవిష్యత్తులో యూఐడీఏఐ లేదా ఇతర ప్రభుత్వ శాఖల పరిశీలన నిమిత్తం ప్రతి ధ్రువీకరణ వివరాలను సంబంధిత రికార్డులలో నమోదు చేయాలి. ఆధార్ ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తింపునకు నిర్ధారణగా అంగీకరించటానికి బదులుగా నాలుగు విధాలుగా (ఆధార్ ప్రింట్, ఈ-ఆధార్, ఎం -ఆధార్, ఆధార్ పీవీసీ) జారీ చేసిన వాటిపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి ధ్రువీకరించుకోవాలి. ఆఫ్‌లైన్ ధ్రువీకరణ సమయంలో ఓవీఎస్ఈలు ఆధార్‌ను వెరిఫైచేయలేకపోతే…సదరు వ్య క్తికి సేవలు నిరాకరించకుండా, ప్రభుత్వం జారీ చేసిన మరేదైనా పత్రం సమర్పించి తన గుర్తిం పును నిరూపించుకునేలా ప్రోత్సహించాలి.
