సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తే చాలు.. ఎవరినైనా చంపడానికి సిద్ధం అయ్యే ఒక సుపారీ గ్యాంగ్‌ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మవివరాలు తెలియజేస్తూ.. కామవరపుకోట మండలానికి చెందిన శివశంకర శ్రీనివాసరావు అలియాస్ సాయి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొన సాగిస్తున్నాడు. తనకు అడ్డువస్తున్న ప్రియురాలి భర్తను హతమార్చాలని ప్లాన్ వేశాడు. జంగారెడ్డిగూడేనికి చెందిన పాత నేరస్తుల సహాయంతో ఏలూరులోని ఒక రౌడీ షీటర్‌తో హత్యకు పథకం పన్నారు. హత్య చెయ్యడానికి 9 లక్షలకు శ్రీనివాసరావు సుపారీ ఒప్పందం చేసుకున్నాడు. నాలుగు లక్షల 50 వేలు అడ్వాన్సు చెల్లించాడు. ఈ ఏడాది జనవరిలో హత్య చేయడానికి స్కెచ్ వేయగా అది విఫలం అయ్యింది. . దీంతో గత సోమవారం ఏలూరు శివారు హైవే పక్కన హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. విషయం తెలుసుకొన్న వన్‌టౌన్, రూరల్ సీఐ తమ సిబ్బందితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. నిందితులు శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడేనికి చెందిన వీపు వెంకటేష్, షేక్ బాషా ఏలూరు చేపల మార్కెట్ వెనుక షేక్ యాకోబ్ జాన్, కత్తేపు వీధికి చెందిన షేక్ బాజీ, కత్తేపు వీధి సీఎస్ఐ చర్చి సమీ పానికి చెందిన కొట్టు ప్రశాంత కుమార్ ను అరెస్టు చేశారు. ఇంకా ఏలూరుకు చెందిన వీరంకి నాగార్జున పరారీలో ఉన్నాడు.వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు మోటారు సైకిళ్లు, మూడు సెల్ఫోన్లు, లక్షా 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు
