సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. నేడు, బుధవారం మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.కర్ణాటక లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 119గా ఉండగా.. కాంగ్రెస్‌ కు 75, జేడీఎస్‌ కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రాష్ట్రాన్ని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ తో నువ్వా నేనా అన్న స్థాయిలో విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *