సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులపై పాలకులవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను విడనాడాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు డిమాండ్ చేశారు. నేడు, బుధవారం ఎఐటియుసి అధ్వర్యంలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం, ఆకివీడు మున్సిపల్ కార్మికులు భీమవరం లోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అప్కాస్ వర్కర్స్ ను పర్మినెంట్ చేస్తామని, అపరిషృత సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నాయకులు ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అప్కాస్ వర్కర్స్ కు 36,000 వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జి.ఓ.నెం.150ను అమలు చేయాలని, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని, మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమరావుమాట్లాడుతూ..60 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కార్మికులు చనిపోయిన సందర్భంలో వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని, కొత్త పిఆర్పీ వేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జులై 7న ఛలో అమరావతిని జయప్రదం చేయాలని కోనాల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లబోయిన రంగారావు, తాడికొండ శ్రీనివాసరావు, ధనాల శ్రీను తదితరులు మాట్లాడారు.
