సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులోనేడు, సోమవారం విచారణ జరిగింది. అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్‌పై అటు అవినాష్.. ఇటు సునీత తరఫు లాయర్ల వాదనలు నిశితంగా విన్న ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డి కి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం నిలిపివేసింది. అంతేకాదు విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేకాదు.. వివేకా 2వ భార్య సిబిఐ ముందుకు రావడంతో కేసు పరిధి పెరగడం తదితర పరిణామాల దృష్ట్యా .. ఇప్పటి వరకూ ఏప్రిల్-30 వరకూ విచారణ ముగించాలని గతంలో గడువిచ్చిన సుప్రీం.. ఇప్పుడు జూన్-30 లోపు విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ముందే ఊహించుకుంటున్నారు..? సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా..? అని ప్రశ్నిస్తూ.. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ సంగతేంటో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ల ఆరు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఇద్దరినీ సీబీఐ ఆఫీసు నుంచి నాంపల్లి కోర్టుకు అధికారులు తరలించారు.
