సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉభయగోదావరి జిల్లాల మీదుగా వెళ్లే రైళ్లలో అక్రమ గంజాయి, మద్యం రవాణా చేస్తున్న పలు ముఠాలు అరెస్ట్ కావడంతో ఇకపై నిరంతర నిఘా ఉంచామని, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీ) డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సబ్ డివిజన్ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఆయన తన కార్యాలయంలో నిర్వహించారు. కేసుల దర్యాప్తు, ఫిర్యాదులపై రివ్యూ చేశారు. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. దొంగతనాలు, గుర్తు తెలియని మృతదేహాల కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మాదక ద్రవ్యాలు ముఠా వ్యక్తుల కోసం ప్లాట్ ఫాం లపై గస్తీ పెంచడంతోపాటు రైళ్లలో నేరాలను అరికట్టడానికి ఎస్కార్టు, బీట్లు పెంచాలన్నారు. అనుమానితులపై ప్రయాణికులు సమాచారం ఇచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జీఆర్పీ రాజమహేంద్రవరం సీఐ విజయ్‌శంకర్, భీమవరం సీఐ ఎస్.శంకర్రావు, తాడేపల్లిగూడెం ఎస్‌ఐ శ్రీహరి బాబు, కాకినాడ సీఐ రామారావు, రాజమహేంద్రవరం ఎస్‌ఐలు మావుళ్లు, లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.
