సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలోని ఎస్వీ ఆర్ కూడలి వద్ద గత బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తనకు అనుకూలమైన వాలంటరీ వ్యవస్థపై తాను తగ్గేది లేదన్నారు. కోర్ట్ లో పోరాడతామన్నారు. తనపై పెడుతున్న కేసులకు భయపడనన్నారు. తాడేపల్లిగూడెంలో సర్కారు కనీసం ఎర్ర కాలువకు పడిన గండ్లు కూడా పూడ్చ లేని దుస్థితిలో ఉందని, పట్టణంలో 5376 టిడ్కో గృహాలు నిర్మిస్తే కేవలం వెయ్యి మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను అందించారని విమర్శించారు. పేదలకు ఇళ్లను ఇవ్వ కుండా“క్లాస్ వార్”గురించి జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.మధ్య నిషేధం అంటూ జగన్ సర్కార్ మద్యం రేట్లు పెంచి లక్ష కోట్ల కు అమ్మకాలు చేస్తుందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం గతంలో ఉన్న పాతధరలకే అందిస్తామన్నారు. కోడేరు – నల్లజర్ల రోడ్డువిస్తరించడానికి స్థలాలు సేకరించిన తరువాత టీడీఆర్ బాండ్లు అంటూ స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు ఇచ్చి, రూ.18 కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. చెత్తపై పన్ను వేసే సీఎం కు ప్రజాధనాన్ని దోచుకోవడమే కానీ ప్రజల సమస్యలు పట్టవన్నారు. తండ్రి లేని పిల్లోడినని చెప్పి జనం దగ్గర పాదయాత్ర చేస్తే .. జనం ఓట్లు వేసి జగన్ను నెగ్గిస్తే ప్రజా ధనాన్ని లూఠీ చేశారని విమర్శించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం అలంపురం గ్రామంలోని జయ గార్డెన్ నుంచి సభా వేదిక వద్దకు పవన్ అభిమానులతో భారీ ర్యాలీగా తరలి వచ్చారు.
