సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నేటి గురువారం ఉదయం కలిశారు. సుమారు గంటకు పైగా ఇరువురి నేతల మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ బయలుదేరారు. గత బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను ఆయన నార్త్‌ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కలుసుకున్నారు. ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.గత రాత్రి నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్‌.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. బహుశా టీడీపీ తో పొత్తు ఎంత కీలకమో తెలపడానికి ఆయన బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *