సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మణిపూర్ అంశంపై విపక్షాలు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌పై వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా పార్లమెంటును స్తంభింపజేశాయి. గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌ను వరుసగా స్తంభింపజేయడాన్ని వైఎస్సార్సీపీ సమర్ధించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు, బుధవారం స్పష్టం చేశారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారన్నారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని.. ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందన్నారు. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు ఉభయ సభలను నిలిపివేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదని, దీనితో మిగతా రాష్ట్రాల సమస్యలు ప్రస్తావనకు రాకుండా, కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాకుండా పోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు గమనించాలని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
