సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మించిన స్థాయిలో భక్తులు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తారని రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ 19 గరుడ సేవ, 20 పుష్పక విమానం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 21.01 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. హుండీ ద్వారా 111 కోట్ల 65లక్షల ఆదాయం లభించిందని అన్నారు. కోటి 11 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని.. 53.84లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేశామని చెప్పారు. అలాగే 8.94 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
