సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిన్న తిరుమలగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవారి గిరి ప్రదక్షిణకు నేడు, శుక్రవారం మధ్యాహ్నం 2గంటల కు ప్రారంభిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందురోజున గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ సంప్రదాయం. ఈ క్రమంలో ఇప్పటికే ఆ మార్గాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. స్థానిక శ్రీవారి పాదుకామండపం వద్ద నుంచి గిరి యాత్ర అట్టహాసంగా ప్రారంభమవుతుంది. సుమారు ఆరు కిలోమీటర్ల మేర గజ, అశ్వ, భజన మండళ్లు, కోలాటాలు, గోవింద దీక్షాధారుల స్వామి నామస్మరణలతో యాత్రను వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభానికి రెండు గంటల ముందు ఎండుగడ్డిని ఒకపొరగా పరిచి నీటితో తడుపనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులకు మార్గమధ్యలో నాలుగు చోట్ల మంచినీరు, ప్రసాదం, టీ కాఫీ, బిస్కెట్‌, పాలు వంటివి ఇచ్చేలా ఏర్పాట్లు చేసారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో రేపు శనివారం జరిగే ముక్కోటి పర్వదిన వేడుకలకు సిద్ధమవుతుంది. శ్రీవారిని ఉత్తరద్వారం మీదుగా వీక్షించే క్రమంలో ఇప్పటికే ఉత్తరద్వారాలను సిద్ధం చేశారు. ఆలయ గోపురాలు విద్యుత్‌ దీప తోరణాలతో, రంగులతో ముస్తాబయ్యాయి. శ్రీవారు వెండిగరుడ, శేషవాహనాలపై కొలువై భక్తులకు దర్శనమీయనున్నారు. రేపు ముక్కోటి రోజున తెల్లవారు జాము 4.30 గంటల నుంచి ప్రొటోకాల్‌, సర్వదర్శనం, రూ.100, 200, 500 టికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ఈవో వి.త్రినాథరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *