సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక స్థల వివాదం నేపథ్యంలో భీమవరం స్థానిక సుంకరబద్దయ్య గారి వీధిలో దారుణం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే .. సుంకరబద్దయ్య గారి వీధిలో సుశీల అనే మహిళకు చెందిన ఇంటి స్థలాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి వేలంపాటలో జయరామ్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి స్థలంలో అడ్డంకులు తొలగించి పూర్తిగా చదును చేసేందుకు జయరామ్ ఒక జేసీబీ ని ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాడు. ఇక డ్రైవర్ జేసీబీతో ఇంటి స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో సుశీల భర్త తీవ్ర ఆగ్రహంతో చేసిన పని అమాయక డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. స్థలాన్ని చదును చేసి గత గురువారం చీకటి పడ్డాక జేసీబీని వెనక్కి తీసుకువెళ్తున్న సమయంలో సుశీల భర్త హఠాత్తుగా జేసీబీపై బకెట్స్ తో పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు తీవ్ర భయకంపితులు అయ్యారు. ఈ ఘటనలో జేసీబీ దగ్దమవగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అయితే తాజగా నేడు, శుక్రవారం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *