సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, సోమవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results) వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 14 శాతం మేర ఉత్తీర్ణత పెరగటం విశేషం. .ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15,743 మంది (92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15,060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత 2,803 పాఠశాలల్లో నమోదయ్యింది. ఇక 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. అయితే ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ బడులు ఉండగా.. మిగిలిన ఒక్కటి గవర్నమెంట్ స్కూల్. ఇదిలా ఉంటే.. ఆకుల వెంకటసాయి మనస్వి అనే విద్యార్థినికి 600కు 599 మార్కులు రావడం గమనార్హం. ఇక 96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌లో నిలచింది.
