సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా గత 3 రోజులుగా చెదురు మదురు వర్షాలతో చల్లబడింది. నేడు, శుక్రవారం జిల్లావ్యాప్తంగా తెల్లవారు జామునుండి వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ముందుజాగ్రత్తగా చేతికందించి ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే పనిలోపడ్డారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతానికి పైగా దాళ్వా మాసూళ్ళు ( పంట కోతలు) పూర్తయ్యాయి. కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో మాసూళ్ళు వేగంగా జరిగాయి. కొద్దీ మంది రైతులు ఆలస్యంగా కోతలు మొదలు పెట్టిన తరుణంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మబ్బులు, మేఘాలు చిరుజల్లులు పడటంతో రైతులు ఆందోళన చెందారు. అనేకచోట్ల ధాన్యం రాశులు, బస్తాలు రోడ్ల మీదే ఉండటంతో తడిచిపోకుండా రైతులు బరకాలతో కప్పుకున్నారు. తేమ శాతం లేకుండా రహదారులపైన, చేలల్లోని కల్లాల్లోను ఆరబెడున్నారు. పొలాలలో నాట్లు వేసిన రైతులు, ఆక్వా రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి రైతులు సరైన దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో దాని ప్రభావం మామిడి పండ్లు చాల తక్కువగా మార్కెట్ కు వస్తుంది. భీమవరం రిటైల్ మార్కెట్ లో మామిడి చెరుకు రసాలు, బంగినమిల్లి పరక ( 13 కాయలు ) గతంలో లేని విధంగా 400 రూపాయలు నుండి 700 రూ వరకు అమ్ముతున్నారు.
