సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా శ్రీపాదుని జన్మస్థానంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకూ శ్రీపాదశ్రీవల్లభ జయంతి సప్తాహా మహోత్సవాలు జరుగనున్నాయి. వారం రోజులపాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌తోపాటు ఉత్తరాధి, ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు అధికంగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమాన్విత దివ్య పాదపద్మములకు మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం, శ్రీసూక్త, పురుష సూక్తములతో సహస్ర నామార్చన, మంగళహారతి, మంత్రపుష్పము, వేదపారాయణ, తీర్థప్రసాద వినియోగం, రుత్విక్కులచే దత్త మూలమంత్ర అనుష్టానం, గణపతి అధర్వ ఉపనిషత్ పారాయణ, శ్రీ గురుచరిత్ర పారాయణ, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణ జరుగుతాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
