సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి నది వరద ఉదృతి కి గత రెండు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయితే నేటి గురువారం ఉదయం 7 గంటల నుండి రాజమహేంద్ర వరం వద్ద గోదావరి వరద ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడం విశేషం. అయితే కోనసీమలో ఇంకా కాజ్ వేలు నీట మునిగి ఉండటంతో పలు ప్రాంతాలలో 3 రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బోట్లలోనే ప్రయాణాలు సాగుతున్న పరిస్థితి. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో రహదారులు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల్లో లక్షల ఎరరాల్లో పంటలు నీటమునిగాయి. మరో ప్రక్క ఏలేరు రిజర్వాయర్ నుంచి వరద జలాల విడుదల గణనీయంగా తగ్గించినా కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద, ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
