సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆర్టీసీ స్థలాలను “లులూ షాపింగ్ మాల్’కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137ను రద్దు చేయకపోతే ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలోకి వస్తామని, ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా రీజియన్ కార్యదర్శి అల్లం సత్యనారాయణ తెలిపారు. భీమవరం లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నేడు, సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నడిబొడ్డునున్న గవర్నర్ పేట 1, 2 డిపోలు, పాత బస్టాండ్ స్థలం నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే 4.15 ఎకరాలను లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి ఆ డిపోలు మూసేసి 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టిడిపి ప్రభుత్వం విజయవాడ ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్టబెట్టారని దానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న స్ధలం నేటికీ ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇవ్వలేదని, 12 పిఆర్సీ లేదు, ఐఆర్ లేదని ఆయన విమర్శించారు. గాజువాక డిపోను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని, భీమవరంలోని స్టాఫ్ క్వార్టర్స్ ను బలవంతంగా ఖాళీ చేయించారని, ఆ స్థలాన్ని అమ్మేస్తారన్న వార్తలు వస్తున్నాయని తిరిగి అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జోనల్ నాయకులు ఎం.ఆర్.పి.రాజు. సిపిఐనేత ఎం.సీతారాంప్రసాద్ చినమిల్లి శ్రీనివాసులు, బి.అరుణ, కె.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *