సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం, ఈ – వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ‘సఖి సురక్ష’ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భముగా అంజిబాబు మాట్లాడుతూ,, స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖి సురక్ష” కార్యక్రమ లక్ష్యమన్నారు. 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాలలో మహిళలు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయించుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. ‘సఖి సురక్ష’ కార్యక్రమం కింద జిల్లాలో మెప్మా పరిధిలోని పట్టణ మహిళల లక్ష్యంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని కౌన్సిల్ భవనం మెప్మా విభాగంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. 9న పాలకొల్లులోని మెప్మా విభాగం 22వ వార్డులోని కొత్తపేట అర్బన్ కమ్యూనిటీ హాలులో, 11న నరసాపురంలోని మెప్మా భవనంలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మెప్మా పీడీ హెబ్సిబా, తహసిల్దార్ రావి రాంబాబు, కారుమూరి సత్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *