సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, శుక్రవారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్ , రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నూతన ఆవిష్కరణలు, సుస్థిరతతో నడిపించబడే ‘వికసిత భారత్’ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను గుర్తు చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందన్నారు. గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇటీవల నక్కపల్లిలో ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న 17.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను సులభతరం చేయడంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రయత్నాలను శ్రీనివాస వర్మ ప్రశంసించారు. పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని శ్రీనివాస వర్మ ఆహ్వానించారు.
