సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, కార్యాలయంలో నేడు, శనివారం జరిగిన మీడియా సమావేశంలో.. ఏపీలో ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 10తేదీన అగ్రికల్చర్ మార్కెట్ యార్డుల వద్ద జరిగే ధర్నా, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు సడలించి ధాన్యం,మొక్కజొన్న,పత్తి పంటలకు ప్రకటించిన మద్దతు ధరలకు అదనంగా రాష్ట్రప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని కౌలురైతులందరికి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు,వ్యవసాయ, ఉద్యాన తదితర అన్నిరకాల పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ధరలు పడిపోయి నష్ట పోతున్నఅరటి,నిమ్మ,బత్తాయి రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించాలని ఆయన కోరారు. అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.ఆనంద్, ఎఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, చేతి వృత్తి దారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.సీతారాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
