సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో పెను ప్రమాదం తప్పింది. యూఏఈలోని బరాక్కా అణువిద్యుత్ కేంద్రం టార్గెట్‌గా ఒక ఉగ్రవాద సంస్థ ?( ఇరాన్ మద్దతుదారులా ?) చేసిన డ్రోన్ దాడి జరగడాన్ని భారత్ తాజాగా నేడు, సోమవారం ఖండించింది. ప్రస్తుతం నివురు గప్పిన నిప్పుల ఉన్న గల్ఫ్ లో ఉద్రిక్తత పరిస్థితి ప్రమాదకర మలుపు తిరుగుతోందని హెచ్చరించింది. ఎవరు దాడి చేసిన అణు కేంద్రాన్ని టార్గెట్ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇది ఆందోళనకరమైన పరిణామమని పేర్కొంది. సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఈ డ్రోన్ దాడి జరిగింది. ప్రధాన విద్యుత్ కేంద్రానికి సమీపంలోని ఎలక్ట్రిక్ జనరేటర్‌పై డ్రోన్ దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రేడియేషన్ లీకేజీ లేదని కూడా చెప్పారు. విద్యుత్ ప్లాంట్‌లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని అన్నారు. . ఇది అకారణంగా జరిగిన ఉగ్రదాడి అని కూడా పేర్కొన్నారు. అయితే, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.
