సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్తో దేశవ్యాప్తంగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.. సినిమా విడుదలకు ముందు పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తూ మూవీ టీమ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచుతోంది. నేడు, గురువారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రెస్ మీట్లో రామ్ చరణ్ , ప్రధాని నరేంద్ర మోదీతో తనకు జరిగిన సంభాషణ గురించి మాట్లాడారు. ఢిల్లీలో మోదీని కలిసిన సమయంలో ఆయన “పెద్ది సినిమా దేని గురించి ఉంటుంది?” అని అడిగారని తెలిపారు. దానికి తాను “ఈ సినిమా గ్రామాల అభివృద్ధి, ప్రజల్లో మార్పు తీసుకురావడం గురించి ఉంటుంది. ఇది వికసిత్ భారత్ ఆలోచనకు దగ్గరగా ఉంటుంది” అని చెప్పినట్లు రామ్ చరణ్ పేర్కొన్నారు.అప్పుడు మోదీ కూడా తనకు జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను చెప్పారని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో చాలా మంది ఫుట్బాల్ జెర్సీలు ధరించి కనిపించారని మోదీ చెప్పారట. ఆ గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్బాల్ జట్టులో ఆడటం వల్ల అక్కడి యువతకు ప్రేరణ లభించిందని, ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి 80 మందికిపైగా ఫుట్బాల్ ఆడుతున్నారని ఆయన చెప్పినట్లు చరణ్ వివరించాడు. ఆ విధంగానే ‘పెద్ది’ సినిమాలో కూడా ఒక వ్యక్తి గ్రామంలో మార్పు తీసుకురావడానికి ఎలా కారణమవుతాడో చూపించనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు
