సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు పేర్ని నాని ఇతర వైసీపీ నేతలపై దాడి చేయడాన్ని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా లో ఎక్స్ వేదికగా ఖండించారు. రాష్ట్రంలో చంద్రబాబు.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో తమ భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న దారుణాలతో ఇబ్బందులు పడుతున్న రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో వెళ్తున్న వైసీపీ నేతలపై దాడి చేయడం దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధిస్తున్నారని.. వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేస్తున్నారని, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారని.. కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించారని ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయని.. రేపు వైసీపీ నుండి ‘రెట్టింపు’ స్పందన ఉంటుందనే సంగతి మర్చిపోవద్దంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.
