సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం–అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నేడు, బుధవారం నుండి మారిన సందర్భంగా తొలి రెగ్యులర్ సర్వీస్‌ను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత ఏడాది జూలై 9న స్థానిక ప్రజలు, భక్తుల చిరకాల కోరిక మేరకు తిరువణ్ణామలై ‘స్పెషల్’ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ రైలుకు భక్తులు, ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో ఆక్యుపెన్సీ 110 శాతానికి చేరుకుందని, ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, రైలును రెగ్యులర్ సర్వీస్‌గా మార్చాల్సిన అవసరాన్ని వివరించి ఒప్పించడం జరిగిందన్నారు.స్పెషల్ ట్రైన్‌గా ఉన్నప్పుడు ప్రయాణికులు సుమారు 30 శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేదని,ఇక టికెట్స్ ఫై అదనపు భారం పడదని అన్నారు. ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
