సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓఎన్ జిసి గ్యాస్ లీకేజ్ కష్టాలు, ఎన్నో విషాదాలు దశాబ్దాలుగా పచ్చని పకృతి లో మమేకమై జీవిస్తున్న ‘కోనసీమ’ వాసులను వెంటాడుతూనే ఉన్నాయి. నేడు, మంగళవారం తాజాగా.. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్‌జీ గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. మూసివేసిన వెల్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో గ్యాస్ బయటకు ఎగదన్నింది. దీనితో పాటు భారీ శబ్దాలు వచ్చాయి. చుట్టుపక్క ల నివాస ప్రాంతాలలోని ప్రజలు భయభ్రాంతులు కు గురి అయ్యారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ నిపుణులు చర్యలు చేపట్టారు. గ్యాస్ బావి చుట్టూ కిలోమీటరు పరిధిలోని నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలో భారీ బ్లో అవుట్ జరిగిన విషయం తెలిసిందే. తరచూ గ్యాస్ లీక్‌లు జరుగుతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. 2014లో నగరంలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీ విస్ఫోటనం సంభవించి 22 మంది మృతిచెందిన ఘటనను పరిసర గ్రామాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.బ్లో అవుట్‌ను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని వెంటనే అదుపు చేసి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు.
