సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని నేడు, మంగళవారం ఉదయం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల వరుస ఓటములతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ‘ఓట్ చోరీ’ అనే అసత్య ప్రచారం తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇమేజ్‌ను ఏమీ చేయలేక, విపక్షాలు నేరుగా ఎన్నికల సంఘం (ECI)పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన ముసాయిదా డ్రాఫ్ట్ జాబితాలో 2 కోట్ల 80 లక్షల మంది మరణించిన వారు, 3 కోట్ల మంది ఆచూకీ లేని వారు ఉన్నారని ఆయన వివరించారు. అలాగే, 6 కోట్ల 30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళినవారు ఉండగా, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న కోటి మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. ఏ వ్యక్తికైనా అభ్యంతరాలు ఉంటే ‘ఫారం-7’ లేదా ‘ఫారం-8’ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని గుర్తుచేశారు. సీఈసీ యాక్ట్-2023 ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరుగుతున్నాయని, కేవలం పత్రికల్లో వచ్చిన ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగానే పనిచేసినట్లు భావించే విపక్షాలు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు రాహుల్ గాంధీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *